ఆకలి బాధలు ఆర్తనాదలే ఆయన కథాంశాలు. పీడితా వర్గాల ప్రజలే ఆయన పాత్రలు. సినిమా అంటే కేవలం కళాత్మకం కాదు.. ఆలోచనత్మకం అని నిరూపించిన ఏకైక మానవీయ వ్యక్తి ఆర్. నారాయణమూర్తి. సామాన్య ప్రజలే తన సినిమాకు పెద్ద ఆస్తి. వాళ్ల కష్టాలే ఆయన సినిమాలోని కథ. ఒక దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నా.. తాను అనుకున్నది వెండితెరమీద ఆవిష్కరించడమే నారాయణమూర్తి స్టైల్. పీపుల్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన ఆర్. నారాయణమూర్తి. పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 స్పెషల్..
ఆర్.నారాయణమూర్తి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద నిలిపించిన పీపుల్స్ స్టార్. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాలో చూపించే హీరో. ఆయన వెండితెర మీద ప్రజా పోరాటాన్ని చూపిస్తున్న ప్రజల స్టార్. నలభై ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నా.. సినిమా సంస్కృతిని ఒంటపట్టించుకోని ముక్కుసూటి మనిషి.
జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతా, దర్శకుడిగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి. తెలుగు సినీవినీలాకాశంలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న...ఆర్ నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లాలోని మల్లంపేటలో 1954 డిసెంబర్ 31న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చదివింది బి.ఎ. ఆ ఊళ్లో బి.ఎ. పట్టా పొందిన వ్యక్తి ఆయన్నే. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టంతో.. అందులో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్లారు. అంతేకాదు.. అంతకుముందు స్కూల్లో, కాలేజీలో చిన్న చిన్న నాటకాలను కూడా వేసేవారు. మొదటి సారిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ సినిమాలో నారాయణమూర్తి నటించారు.
ఆయన అనుకున్నవామపక్ష సిద్దాంతాలను తెరమీద ఉంచాలంటే.. తానే హీరో కావాలనుకున్నాడు. కానీ హీరో అవకాశాలు ఎవ్వరు ఇవ్వలేదు. అందుకు తానే డైరెక్టర్‌గా మారితే తన సినిమాను తానే తీయోచ్చు అనుకున్నాడు. ఆ తరువాత నిర్మాత లేకపోవడంతో తానే ప్రొడ్యూసర్‌గా కూడా మారాడు. అయితే జేబులో డబ్బులు లేకుండానే నిర్మాత అయ్యారు. తన స్నేహితులు ఇచ్చిన డబ్బుతో 1984లో స్నేహ చిత్ర పిక్చర్ బ్యానర్ ని స్థాపించి.. ‘అర్థరాత్రి స్వాతంత్య్రం’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ఆ తరువాత చాలా సినిమాల్లో నారాయణామూర్తి నటించినా అంతగా పేరుని తీసుకురాలేదు. దాంతో మళ్లీ దాసరి నారాయణరావు ‘సంగీత’ సినిమాలో మెయిన్ రోల్ ఇచ్చారు. ఆ సినిమా మంచి పేరుని తీసుకువచ్చింది. సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు తన గురువు అని చెప్పుకుంటూ ఉంటారు నారాయణ మూర్తి.
ఆ తర్వాత స్వీయ దర్వకత్వంలో ‘ఎర్రసైన్యం’, ‘ఓరేయ్ రిక్షా’, ‘అడవి దివిటీలు’, ‘చీమలదండు’, ‘చీకటి సూర్యులు’, ‘వేగు చుక్కలు’, ‘కూలన్న’, ‘దళం’, ‘దండోరా’, ‘రాజ్యాధికారం’ పేరు ఏదైనా సరే.. దర్శకుడు,నిర్మాత, యాక్టర్ ఒక్కడే. ఆ సినిమాల్లో సామాన్యుడే హీరో. విప్లవ భావాలే కథాంశాలు. ఇవే గత రెండున్నర దశాబ్దాలకు పైగా స్నేహ చిత్రపతాకం పై సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి ఆర్. నారాయణమూర్తి.