అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. ... కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ఇవి మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి.
తన కుటుంబంలోనూ, స్నేహితులలోనూ ఎవ్వరికీ లేనంత మంచి ఇల్లు కట్టుకోవాలన్నది అతని కోరిక. ఎంతగా అంటే.. చెప్పలేనంతగా; నిద్ర కూడా సరిగా పట్టనంతగా. అది కామం.
ఎంత ప్రయత్నించినా ఆ ఇంటిని కట్టడానికి సరిపడా ధనం అతనికి సమకూరడం లేదు. తన కోరిక తీరకపోతుండేసరికి చిర్రెత్తుకొచ్చి, అయినదానికీ కానిదానికీ ఇంట్లోవాళ్ళ మీద అంతెత్తున లేచి అరవడం మొదలుపెట్టాడు. అంటే కామం తీరకపోయేసరికి వచ్చేది క్రోధం.
మొత్తానికి ఒకరోజు, అతను కోరుకున్నట్టుగా అందమైన ఇల్లు తయారయ్యింది. అప్పటినుంచి, రోజూ కనీసం ఒక్కసారైనా ఆ ఇంట్లో ఉన్న ప్రతీ గదినీ తనివితీరా చూసుకుంటూ, గోడలపై చిన్న మచ్చ కూడా పడకుండా జాగ్రత్త పడుతూ, ఆ ఇంటిని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేనంతగా దానిపై ప్రేమను పెంచేసుకున్నాడు. అది మోహం.
ఇల్లు కట్టుకున్నప్పుడు తెలివిగా ప్రక్కవారి స్థలాన్ని కూడా కొంత ఆక్రమించి గోడకట్టేశాడు. అది ఆ తరువాతెప్పుడో తెలిసి, అవతలివాళ్ళు అడిగినా, వాళ్ళు పెద్దగా పరపతిలేనివారు కనుక తననేమీ చేయలేరన్న ధైర్యంతోనూ, తనది అనుకున్నదానిలో అంగుళం భూమి కూడా బయటకువెళ్ళకూడదన్న అత్యాశతోనూ వాళ్ళ మాటలను లెక్కచేయలేదు. ప్రాణంపోయినా పర్వాలేదుకానీ, తనది అన్నది ఇసుమంతైనా వదులుకోలేని ఆ అవగుణమే.. లోభం.
తన ఇంటివంటి ఇల్లు ఆ చుట్టుప్రక్కల మరొకటి లేదనీ, అలాంటి ఇల్లు అక్కడ వేరొకడు కట్టలేడనీ అహంకారంతో మాట్లాడుతూ, మిగిలినవారిని చిన్నచూపు చూడటం మదం.
ఆ ఇంటికంటే గొప్పగా ఉండే ఇంటిని అక్కడెవరన్నా కడితే, ఆ ఇంటిని చూసినప్పుడల్లా అసూయతో కడుపురగిలిపోవడం మాత్సర్యం.
ఏ ఒక్కరిలోనూ ఈ అరిషడ్వర్గము పూర్తిగా లేకుండా పోదు. కొందరిలో కామం ఎక్కువ ఉంటే, ఇంకొందరిలో మదం, మరికొందరిలో మోహం ఎక్కువగా ఉండుండవచ్చు. కొందరు సత్పురుషులలో ఈ ఆరింటిలో కొన్ని అసలు లేనే లేకపోవచ్చు. లేదా అతి తక్కువ స్థాయిలో మాత్రమే ఉంటుండవచ్చు. ఇక రమణ మహర్షివంటివారి గురించి వింటున్నా, చదువుతున్నా, వాళ్ళు ఈ అరిషడ్వర్గానికి అతీతులన్న భావన మనందరికీ కలుగుతూనే ఉంటుంది. అలానే, మనలో తక్కువగానో, నిద్రాణంగానో ఉన్న ఈ గుణాలు, సమయం వచ్చినప్పుడు మాత్రమే పూర్తిస్థాయిలో బయటపడవచ్చు. అంతవరకూ అవి మనలో ఉన్న విషయం కూడా మనకు తెలియకపోవచ్చు. ఒక వ్యక్తికి అధికారం వచ్చాక మాత్రమే, అతనిలో ఉన్న మదం విజృంభించవచ్చు. అలానే, తనతో పాటూ కలిసి తిరిగినవాడు తనకంటే గొప్పగా ఎదిగిపోయినప్పుడు మాత్రమే అతనిలో ఉన్న మాత్సర్య గుణం బయటకు రావొచ్చు. అదేవిధంగా మిగిలిన గుణాలు కూడా. ఏ గుణమైనా సరే ఉండవలసినదానికంటే ఎక్కువ ఉంటే అది వినాశనానికి దారితీస్తుందని చెప్పే శ్లోకం ఒకటుంది.
అతి దానాత్ హతః కర్ణః
అతి లోభాత్ సుయోధనః
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్.
అతిగా దానం చేసి, అంటే తన కవచకుండలాలను కూడా ఇచ్చివేసి కర్ణుడు, అతిగా లోభానికి పోయి, అంటే కనీసం అయిదూళ్ళు ఇచ్చి రాజీ చేసుకునే అవకాశం ఉన్నా, సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పి యుద్ధానికి వెళ్ళిన దుర్యోధనుడు, విపరీతమైన కామం వలన, అంటే.. పరకాంతను పొందాలనే కోరికతో రావణాసురుడు, వినాశనాన్ని కొనితెచ్చుకున్నారు. కనుక అతి అన్నది ఎల్లప్పుడూ విడిచిపెట్టవలసినదే అన్నది ఈ శ్లోక భావం.
స్వస్తి!
అరిషడ్వర్గాలు అన్నది సరైన మాట కాదు. అరిషడ్వర్గము అనాలి.
అరి అంటే శత్రువు. షట్+వర్గము అంటే ఆరింటి సమూహం. మొత్తమ్మీద ఆరుశత్రువుల గుంపు అరిషడ్వర్గం. వాటి పేర్లు - కామం(Desire), క్రోధం(Anger), లోభం(Greed), మోహం(Infatuation), మదం(Arrogance), మత్సరం లేదా మాత్సర్యం(Envy). శత్రువులన్నామే కానీ ఎవరికి శత్రువులో ఎందుకు శత్రువులో చెప్పలేదు. అంటే అందరికీ శత్రువులన్నమాట. కారణం లేని శత్రుత్వం ఎక్కడా ఉండదు కదా మరి.
న కశ్చిత్ కస్యచిత్ మిత్రం
న కశ్చిత్ కస్యచిత్ రిపుః।
వ్యవహారేణ జాయంతే
మిత్రాణి రపవస్తథా॥
అని అన్నారు మనవాళ్లు. ఎవరూ ఎవరికీ మిత్రులు కారు. ఎవరూ ఎవరికీ శత్రువులూ కారు. ఒకరితో ఒకరు లావాదేవీ పెట్టుకునే విధానాన్ని బట్టి మిత్రులూ శత్రువులూ తయారవుతారు. అటువంటిది ఈ ఆరూ అందరు మనుషులకీ భేదభావం లేకుండా శత్రువులయ్యాయి. ఏమిటి ఇవి చేసిన అపకారం అంటే, ఒకటే - మనిషి కన్ను కప్పడం. ఈ కన్ను భౌతికమైన కన్ను కాదు. బౌద్ధికమైన కన్ను. అంటే, మనిషిలో ఉన్నదీ, మిగిలిన జంతువులలో లేనిదీ అయిన జ్ఞానం. వివేచన. విచక్షణ.
ఈ కన్ను యేదో మూసేస్తే మూతపడిపోతుందా అని తరువాతి ప్రశ్న. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక జిల్లా కలెక్టరు దురదృష్టం కొద్దీ మందుకు అలవాడు పడి క్రమక్రమంగా బానిస అయాడనుకుందాం. అతను మందు తాగనప్పుడూ, కొద్దిగా తాగినప్పుడూ, ఎక్కువగా తాగుతున్నప్పుడూ అతడు కలెక్టరే. కలెక్టరు కుర్చీలో కూర్చున్నప్పుడు అతడికి కలెక్టరు జ్ఞానం అనుభూతిలోకి వస్తుంది. మందు తాగుతున్నప్పుడు మత్తు అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రావడంలో తేడా ఏమీ లేదు.
బేరీజు వేసి చూస్తే కలెక్టరు బాధ్యతకూ, వ్యసనానికీ ఆంతర్యం చాలా ఉందని అంటాం. రెండింటికీ ఏమిటి తేడా? వస్తువులుగా చూసినప్పుడు ఏమీ లేదు. అయితే అనుభూతిలో ఆ మనిషికి కలెక్టరు పదవి పదవి బాధ్యతనీ, వివేచననీ, ఔన్నత్యాన్నీ ఇస్తోంది. అంతే కాదు, అతడి 'అదుపు'లో ఉండి బలాన్నిస్తోంది. అతణ్ని నిర్మిస్తోంది. ఇంకోవైపు తాగుడు అతడిని పడవేసి తొక్కుతోంది. ఉన్నతమైన పదవిలో ఉన్న అతనిని తనలోకి పూర్తిగా లాగుతోంది. కలెక్టరుగా యెదిగినవాడు తాగుతున్నప్పుడు ఆ దృష్టిని కోల్పోయాడు. ఆ దృష్టి ఉంటే ఒళ్లు మరిచి తాగలేడు.
ఇది బుద్ధికి తగిలిన దెబ్బ. అలా దెబ్బకొట్టగలిగిన తాగుడు వ్యసనమవుతుంది. అప్పుడది వ్యక్తిత్వానికి శత్రువవుతుంది.
ఇక్కడ తాగుడు వల్ల శరీరానికి యెదురయ్యే సమస్యల గురించి నేను మాట్లాడటం లేదు. తాగుడు ఆరోగ్యానికి చేటు చేస్తుంది కనుక మానేయమని అనడం నా దృష్టిలో తక్కువ స్థాయి ఆలోచన. శరీరానికి ఇబ్బంది లేకున్నా జ్ఞానాన్ని కలవరపెట్టేది ఏదైనా సరే, విడిచిపెట్టవలసిందే.
అయితే, తాగుడుని తమ అదుపులో పెట్టుకున్నవారు ఉండవచ్చు. అది వాళ్ల నడవడికని నష్టపరచకపోవచ్చు. అంతవరకూ అది శత్రువు కాదు.
కామం శత్రువు కాదు. నిన్ను నీనుంచి పడవేసే కామం శత్రువు. అలాగే లోభం శత్రువు కాదు. నిన్ను నీనుంచి పడవేసే లోభం శత్రువు. ఇక్కడ 'నువ్వం'టే నీ వ్యక్తిత్వం. నీ విలువలు.
ఆ ఆరూ ప్రతీ మనిషిలోనూ ఉండేవే. అయితే అలా శత్రువులుగా మారే అవకాశం ఉన్నవన్నమాట. ఈ రకమైన శత్రువులు ఆరేనా అంటే, మనిషిని దెబ్బతీసేది ఏదైనా అయినా ఆ అరింటిలో ఏదో ఒకదాన్లో చేరిపోతుంది.
మనిషి జ్ఞానంలో ఇటుకలవంటివైన ఈ భాగాలే అదుపుతప్పినపుడు అదే మనిషిని దిగజార్చడం విచిత్రం.
కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః।
జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత॥
అరిషడ్వర్గాలు అనగా కామం(అనగా కోరిక),క్రోధం(అనగా కోపం),లోభం(అనగా పిసినారితనం), మోహం(ఇదీ కామం లాంటిదే అమ్మాయిలపై ఆకలి కలిగి ఉండడం. ఇక్కడ ఆకలి అంటే మోహం అని అర్ధం), మధం (అనగా గర్వం), మాత్సర్యం (అనగా అసూయ పడడం). ఇవ్వన్నీ ఎక్కడో ఉండవు. ప్రతీ ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉంటాయి. ఇవే మనకు శత్రువులు. వీటిని జయించగలిగితే మహానుభావులు అవుతారు. దీనికి ఉదాహరణ స్వామీ వివేకానంద.